శ్రీరామ చంద్రుని గురించిన నా వ్యాసములు
రచన : డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షిఅయోనిజ అయిన సీతామాత ఎందుకు బాధ పడింది ?
దైవ సంకల్పం. అది సీతామాత సంకల్పమే !
అది ఆవిడ బాధ పడటం కాదు, కర్తవ్య నిర్వహణ, అవతార ప్రయోజనములో ఆవిడ పాత్ర నిర్వహణ.
శ్రీరామచంద్రుడు ధర్మమే స్వరూపమైనవాడైనా, మర్యాదా పురుషోత్తముడైనా, మానవమాత్రులకు అలభ్యమైన సమస్త దైవీ గుణాల స్వరూపుడైనా, సీతమ్మతల్లి అయోనిజ, జీవన్ముక్తుడైన జనకుని కుమార్తె, మహా పతివ్రత, సాధ్వీశిరోమణి, లోకమాత అయినా, పదినెలల పాటు రావణుని వద్ద బందీగా ఉండి బాధలు పడటానికి కారణమేమిటని ఎందరికో సందేహం.
అసలు సీతామాత ఎప్పుడు బాధ పడింది, ఎందుకు బాధ పడింది? అలా మామూలు మానవులకు అనిపిస్తుంది. అంతే. నిజానికి మానవ దేహాలు ధరించి వచ్చినందుకు వారిరువురు కూడా అన్ని రకాల మానవ భావాలను అనుభవించినట్లే కనిపించారు. సుఖమైనా, దుఃఖమైనా సమానంగా అనుభవించారు. కానీ వారికసలు ఎడబాటన్నదే లేదు, బాధ అన్నదే లేదు. ఎందుకంటే, వారిరువురు ఒకరి మనస్సులో మరొకరున్నారు. వారిద్దరూ ఎప్పుడూ అవిభాజ్యులే ! అందుకే వారి దాంపత్యం అంత ఆదర్శమైంది. వివాహ సమయాలలోను, దంపతులెవరు పెద్దలకు నమస్కరించినా, సీతారాములలా కలకాలం వర్ధిల్లండని దీవిస్తారు. నిజంగా సీతారాములు బాధలు పడితే, వారిలా ఉండాలని ఎవరైనా ఎందుకు కోరతారు ?
శ్రీరామ చంద్రుడు శ్రీమద్రామాయణము ప్రకారము పదకొండు వేల సంవత్సరాలు (11,000) రాజ్యపాలన చేశాడు. పదహారు సంవత్సరాల వయసులో రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట యాగ రక్షణార్థం వెళ్ళారు. శ్రీ రామావతార ప్రయోజన కార్యక్రమం అక్కడే ప్రారంభమైంది. యాగము పూర్తవగానే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను జనకుని వద్దకు తీసుకెళ్ళాడు. సీతారామ కల్యాణము జరిగింది. సీతారాములు ఇంచుమించుగా వెయ్యి యాభై సంవత్సరాలు కలిసి మహదానందంగా కాపురం చేశారు కదా ! మధ్యలో – 14 సంవత్సరాలు వనవాసం, ఆ వనవాస సమయంలో ఈ దంపతులిద్దరూ కలిసే ఉన్నారు. కేవలం పది నెలలు సీతమ్మ రావణుని చెరలో ఉంది. పట్టాభిషేకానంతరం ప్రజావాక్కు ననుసరించి గర్భవతి అయిన సీతమ్మను శ్రీరాముడు వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టిస్తాడు. లవకుశులకు 14- 15 సంవత్సరాల వయసులో శ్రీరామచంద్రుడు సీతమ్మను కలుస్తాడు, సీతాదేవి లవకుశులను భర్తకు అప్పగించి, మళ్ళీ ఒకసారి తన పాతివ్రత్యం నిరూపించుకుంటూ భూమాతలో కలిసిపోతుంది. లవకుశులకు పట్టాభిషేకము చేసి శ్రీరాముడు అవతారం చాలిస్తాడు. ఆ కొద్ది కాలం తప్ప మిగతా కాలమంతా వారు ఎంతో ఆనందంగా గడిపారు కదా !
మానవ జన్మ నెత్తిన తరువాత ఎటువంటి వారికైనా కష్టసుఖాలను అనుభవించక తప్పదు. వెయ్యేళ్ళ పైన వారిద్దరు సుఖంగా ఉన్నా, సీతారాములు కొన్నేళ్ళు వియోగా న్ననుభవించినా, మనమందరమూ వారి బాధను తలుచుకుని బాధ పడతాము. నిజానికి వారనుభవించిన ఆనందం బహుకాలం, అనుభవించిన కష్టాలు, దుఃఖం భహు స్వల్ప కాలం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞానుసారం గురువైన విశ్వామిత్ర మహర్షి ఆదేశంతో తాటక వధతో రాక్షస సంహారం ప్రారంభించి మారీచసుబిహువులను శిక్షించి, దండకారణ్యంలో ఖర దూషణాది పధ్నాలుగు వేలమంది రాక్షసులను తానొక్కడే సంహరించాడు. ఇంక రావణ సంహారం చెయ్యాలి. శ్రీ రాముడు ఒక్కడే చెయ్యగలిగినా, అందరి సహకారంతోనే నిర్వర్తించ వలసిన కార్యమది.
లక్ష్మీదేవి అంశ అయిన వేదవతే సీతామాతగా వచ్చింది. ఆవిడ వల్లనే రావణ సంహారం, రాక్షస వినాశనం జరగాల్సి ఉంది. కనుకనే రావణాసురుని పథకం ప్రకారం మారీచుడు మాయలేడిగా, బంగారు జింకలా వచ్చినా, సీతారాములకు అది రాక్షసమాయ అని తెలుసు కదా ! బంగారు జింక అనేది బ్రహ్మ గారి సృష్టిలో ఉండదని తెలిసి కూడా సీతమ్మ బంగారు జింకను తెచ్చి ఇవ్వమని అడిగింది, తెలిసి కూడా శ్రీరాముడు భార్య ముద్దును చెల్లించే భర్తలా బంగారు జింకను తీసుకురావటానికి వెళ్ళాడు. లక్ష్మణుడు అది రాక్షసమాయ అంటే, రాక్షసమాయే అయితే ఛేదిస్తానన్నాడు. సీతమ్మను రక్షించే బాధ్యతను లక్ష్మణునికి అప్పగించాడు.
“ఇహ త్వం భవ సన్నద్ధో యంత్రితో రక్ష మైథిలీమ్”
“అప్రమత్తేన తే భావ్యమ్ ఆశ్రమస్థేన సీతయా”
వారి పథకం ప్రకారం మారీచుడు శ్రీరామ బాణాహతితో మరణిస్తూ “హా లక్ష్మణ, హా సీతే” అనగానే సీతమ్మ భయపడినట్లు, భర్తకేదో అయిందేమో అని కంగారు పడిన భార్యలా లక్ష్మణుని అన్నగారి రక్షణార్థం వెళ్ళమంటుంది. తన అన్నకు ఏ ఆపదా వాటిల్లదనీ ముల్లోకాలలో ఆయనను ఎదిరించగలవారు లేరనీ లక్ష్మణ స్వామి ఎంత నచ్చ చెప్తున్నా వినక, నీవెందుకు మీ అన్నను రక్షించటానికి వెళ్ళవు ? నీవు దుష్ట బుద్ధి కలవాడివి అంది.
“సుదుష్టస్త్వం వనే రామమ్
ఏకం ఏకోऽనుగచ్ఛసి !
మమ హేతోః ప్రతిచ్ఛన్నః
ప్రయుక్తో భరతేన వా” !!
నా భర్త ఒంటరిగా వనాలకు రావటం చూసి, నా కోసమే ఆయన వెంట వచ్చావేమో ! లేక భరతుడే మాకు హాని తలపెట్టమని ప్రేరేపించాడేమో – అంటూ అపవాదు వేసింది.
“సమక్షం తవ సౌమిత్రే !
ప్రాణాంస్త్యక్ష్యే న సంశయః !
రామం వినా క్షణమపి
న హి జీవామి భూతలే”!!
నా భర్త లేకుండా క్షణమైనా జీవించ లేను, నీ ఎదుటే ప్రాణాలను వదిలేస్తానంది.
తల్లిలా తాను చూసుకుంటున్న , పరమ పావని అయిన వదినగారు ఒక సాధారణ స్త్రీ వలె అలాంటి మాటలననగానే దుఃఖితుడై విధి లేక సీతమ్మను వదిలి లక్ష్మణుడు వెళతాడు.
సీతమ్మ అంత కటువుగా మాట్లాడకపోతే, అన్నగారి ఆజ్ఞను మీరి, సీతమ్మను వదిలి లక్ష్మణుడు వెళ్ళడు. లక్ష్మణుడు వెళితే కానీ రావణుడు సీతమ్మను అపహరించటం, లంకకు తీసుకెళ్ళటం జరగదు. తాను వెళ్ళి లంకలో కూర్చుంటే తప్ప, శ్రీరాముడు లంకకు వెళ్ళటం, రావణుని సంహరించటం జరగదు. కనుక సీతమ్మ ఆ విధంగా మాట్లాడి, రావణునితో అపహరింపబడి, లంకకు వెళ్ళి, తాను నిస్సహాయురాలైన స్థితిలోనైనా పరపరుషుని చేత స్పృశింపబడినందుకు, తన కుమారుని వంటి వాడు, పరమ ధార్మికుడైన మరిదిని – శ్రీ లక్ష్మణ స్వామితో పరుషంగా మాట్లాడినందుకు, ఆ దోషముల పాపములను పరిహరించు కొనుటకు లంకా నగరం చేరినప్పటి నుంచి తన భర్త అయిన శ్రీరామ నామ జప తపస్సును, రామ భావనా వ్రతమును ఆచరించటం ప్రారంభించింది. అయినా, మానవ ఉపాధి కలిగినవారు ఎవరైనా సరే, ఏ కర్మల నాచరించినా, వాటి ఫలాలను అనుభవించ వలసిందే. అందుకే సీతమ్మ శోకించ వలసి వచ్చింది. రావణ వధానంతరము తనంత తానుగా అగ్ని ప్రవేశం చేసి, అగ్ని పునీత అయింది పరమ పావని, ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన జానకీమాత.
రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి
జానక్యాః కమలామలాంజలి పుటే – శ్లోక వివరణ.
మన ఆంధ్రుల వివాహములలో ఎవరి వివాహంలోనైనా తలంబ్రాలు పోసుకోవటం ఆనందాన్ని కలిగించే ఒక మంచి వేడుక.
శ్రీసీతారాముల కల్యాణంలో అది కేవలం వేడుక మాత్రమే కాదు, ఒక అద్భుత హేల !
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మ రాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః !
స్రస్తా శ్యామల కాయ కాంతి కలితాః యా ఇంద్ర నీలాయితాః !
ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః !!
పద్మాల వంటి సీతామాత అరచేతులలో ఉన్న ముత్యాల తలంబ్రాలు పద్మ రాగమణుల వలె ఎర్రగా కనిపించాయి. సీతామాత శ్రీరామ చంద్రుని తలమీద ఆ తలంబ్రాలను పోస్తున్నప్పుడు అవి తెల్లగా మల్లె మొగ్గలలా ప్రకాశించాయి. తరువాత ఆ తలంబ్రాలు శ్రీరామచంద్రుని తల మీద నుంచి ఆయన దేహం మీదకు పడుతూ ఇంద్రనీల మణులలా ప్రకాశించాయి. అటువంటి సీతా రామ చంద్రుల వివాహ సమయంలోని తలంబ్రాలు మనకు సకల శుభములను కలిగించు గాక !
ఇది ఈ శ్లోకానికి భావము. తెల్లని ముత్యాలు అమ్మవారి పద్మపు రేకల వంటి రంగు కలిగిన సుకుమారమైన చేతుల్లోకి రాగానే అవి అమ్మవారి చేతి కాంతితో పద్మరాగ మణులలా ప్రకాశించాయి. తన దోసిలిని పైకెత్తి శ్రీరాముని తలమీద పోస్తున్నప్పుడు తమ సహజమైన తెల్లదనంతో ముత్యాలలానే ప్రకాశించాయి. శ్రీరాముని తలమీద నుంచి జాలువారి నీలమేఘ శ్యాముడైన ఆయన ఒంటికి తగలగానే నీలి వర్ణాన్ని పొంది, ఇంద్రనీల మణులలా ప్రకాశించాయి. సీతారాముల కల్యాణ సమయంలోని అటువంటి ముత్యాల తలంబ్రాలు మనలను రక్షించు గాక !
ఈ శ్లోకంలోని అంతరార్థం ఏమిటంటే, సీతామాత తన రెండు చేతులను కలిపి దోసిలిలా చేసి, ముత్యాల తలంబ్రాలతో నింపి, తన హృదయంలో తన భర్త పట్ల ఉన్న ప్రేమతో అవి రాగరంజితమై పద్మరాగ మణులలా ప్రకాశిస్తూ ఉంటే, తన ప్రేమ భరితమైన హృదయాన్ని స్వీకరించమని శ్రీరామునికి అర్పించింది. స్వచ్ఛమైన కడిగిన ముత్యాలలా పవిత్రమైన, తన మీది ప్రేమతో రాగరంజితమైన తన హృదయాన్ని సీతమ్మ అర్పించగానే, ఎంతో అనురాగంతో, ప్రేమతో శ్రీరామ చంద్రుడు ఆమె ప్రేమను, హృదయాన్ని స్వీకరించి తనదిగా చేసుకున్నాడు. ఆయనలోకి చేరగానే సీతమ్మ రామత్వాన్ని పొందింది. ఆమె చేతులతో అర్పించిన ముత్యాలు రామరాగాన్ని పొందాయి.
అంటే, భక్తుడు భక్తితో తనను పరమేశ్వరునికి అర్పించుకుంటే, తన జీవత్వం అంతరించి పరమేశ్వరత్వాన్నే పొందుతాడు. అంటే ముక్తి పొందుతాడు.
భార్య భర్తలు అంటే సీతారాములలా ఉండాలి. ఈ కాలం పిల్లలు పూర్వకాలపు అమ్మాయిలలా ఉండటం లేదు, అలా ఆలోచించటం లేదు, ప్రవర్తించుట లేదు. ఆడపిల్ల పెళ్ళయ్యాక సీతమ్మలా తన హృదయాన్ని తన భర్తకు సమర్పించి, భర్త మీద నమ్మకము, ప్రేమ కలిగి, సహనంతో ఉంటే ఆమె భర్త తప్పకుండా శ్రీరాముని వలెనే తన భార్యను ప్రేమిస్తూ, ఆదరిస్తాడు. ఆ జంట సకల శుభాలను పొందుతూ జీవితాంతము సుఖపడతారు, ఇహ పర శుభాలను పొందుతారు.
శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు నియమముతో అమ్మవారిని వివిధ నామరూపాలతో ఆరాధించి, దశమినాడు పండుగ చేసుకుంటాము. వసంత నవ రాత్రులలో జగన్మాతను సీతామాతగా ఆరాధించి, నవమి నాడు శ్రీరామ చంద్రుడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కల్యాణం చేస్తాము. లోక కల్యాణ కారకులైన సీతారాముల కల్యాణం జగత్కల్యాణ కారకము.
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి
రామరాజ్యం గొప్పదనం.
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్సుమిత్రా సుతః
శతృఘ్నో భరతశ్చ పార్శ్వ దళయోః వాయ్వాది కోణేషు చ !
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం !!
అందరూ రామరాజ్యం కావాలంటారు. శ్రీ రామరాజ్యమే కావాలని ఎందుకు కోరతారు ?
రామరాజ్యము అంటే రాముడు పాలించిన రాజ్యము. రాముని చేత పాలించబడిన రాజ్యము. రాముడు అంటే రమించేవాడు, రమింపచేసేవాడు. రామ అనే శబ్దము రమ్ – to enjoy రమతే, ఆనందించు – అనే ధాతువు నుంచి ఏర్పడింది. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. అందరినీ ఆనందింప జేసేవాడు. శ్రీరాముని ఏలుబడిలో, ఆయన రాజ్యంలో సర్వ ప్రాణికోటీ ఆనందంతోనే ఉన్నది. సర్వ మానవులూ ఆనందంగానే ఉన్నారు. ఆనందం, సంతోషం తప్ప వేరేలా లేరు. ఆనందమేమైనా ఒక వస్తువా !, డబ్బో, చీరలో పంచినట్లు పంచటానికి ! అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఆనందం అనేది అనుభూతి. మనస్సు, హృదయం, శాంతితో అనిర్వచనీయమైన ఉదాత్త భావంతో, పరమాత్మ భావనతో తన్మయత్వం చెందటాన్నే ఆనందము అంటాము. ఆనందమును అనుభవిస్తామే తప్ప ఇలా ఉంటుంది అని వర్ణించో, పోల్చో చెప్పలేము. అటువంటి ఆనందానుభవము శ్రీరామచంద్రుని ముఖ పద్మమును చూడగానే కలుగుతుంది. శ్రీరాముని తత్త్వాన్ని వివేచన చేస్తే కలుగుతుంది. రామ నామమును ఉచ్చరించగానే కలుగుతుంది. అటువంటి రాముని పాలనలో ప్రజలు ఎంతటి సుఖశాంతులతో, శాంతి సంతృప్తులతో, సకల శుభాలతో, భయము, బాధలు, రోగాలు, కొరతలు అంటే ఏమిటో తెలీని స్థితిలో సుఖంగా స్వస్థతతో ఉన్నారు. కనుకే రామరాజ్యం కావాలని సర్వ మానవులూ కోరుకుంటారు.
తండ్రికి బిడ్డలందరి మీదా సమానమైన ప్రేమ ఉంటుంది కదా ! దశరథ మహారాజుకు నలుగురు పుత్రుల మీదా సమానమైన ప్రేమ ఉన్నా, గుణ సంపద ఆధిక్యత వలన, కేవలము ముఖ దర్శన మాత్రమున ఆత్మలో కలిగే ఆనందానుభవం వలన శ్రీరాముని మీద అధికమైన ప్రేమ. రాముడు బాలుడుగా ఉన్నప్పుడే రాజసౌధంలోని వారూ, అంతఃపురంలోని వారూ, అయోధ్యానగర వాసులందరూ కూడా శ్రీరాముని గుణాల వల్ల అతనిని ప్రేమించారు. రాముడు తమకు రాజు కావాలని కోరుకున్నారు. దశరథుడు తనకు కలుగుతున్న దుర్నిమిత్తములను గమనించి, రామునికి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలనుకుని, మంత్రులను, ప్రజలను పురోహితులను గురువులను అందరినీ సమావేశ పరిచి తన నిర్ణయము చెప్పగానే ఏకగ్రీవంగా అందరూ ఆమోదించి రాముడే మాకు రాజు కావాలన్నారు. దశరథ మహారాజు కించిదాశ్చర్యానికిలోనై తన పాలనలో ఏమైనా అసంతృప్తి ఉన్నదా, ఇంతలా రాముని రాజులా కోరుతున్నారే, అని అడిగితే, ప్రజలను కన్న బిడ్డలలా పాలించే దశరథ మహారాజు పాలనలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామనీ, కానీ కేవలం రాముని గుణసంపదకి ముగ్ధులమయి, అతనిని రాజుగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పారు. అదీ రాజు కావలసిన వ్యక్తికి ఉండవలసిన మొదటి అర్హత – ప్రజాభిమానము. అది రామునికి సంపూర్ణంగా ఉంది.
దశరథుడు రాముని పిలిచి నిన్ను రేపు అయోధ్యకు రాజును చేస్తాననీ, దీక్ష వహించమనీ చెప్తాడు. రాముడు సరేనని చెప్పి తండ్రికి నమస్కరించి, తల్లి దగ్గరికి వెళ్ళి శుభ వార్త చెప్పి నమస్కరించి, తల్లి ఆశీస్సులు తీసుకుని, సీతాదేవి దగ్గరికి వెళ్ళి శుభవార్త వినిపిస్తాడు. అంతలోకే కైకేయి, రామునికి తండ్రి కబురు పంపినట్లు చెప్పించి, పిలిపించి, రాముడు రాగానే, రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలని తాను కోరిన వరాలను గురించి చెప్పగానే, అలాగే తల్లీ ! తండ్రి ఆజ్ఞాపాలనమే నాకు కర్తవ్యము అంటూ అదే ఉదాత్త శాంత చిత్తంతో నమస్కరించి అరణ్యానికి వెళ్ళటానికి సిద్ధపడతాడు. ద్వంద్వాతీత స్థితిని పొందిన స్థితప్రజ్ఞుడు రాముడు. ఇది రాజుకు ఉండవలసిన మరొక సద్గుణము. తన పర భేద బుద్ధి లేకపోవటము, సుఖదుఃఖాలను సమబుద్ధితో గ్రహించగలగటము, సంయమనము పాటించటము తెలిసి ఉండాలి రాజైనవాడికి.
సీతాదేవిని రాముడు అగ్నిప్రవేశం చెయ్యమనలేదు. ఉన్న పరిస్థితిని చెప్పి, రావణుని చెరలో ఉన్న నిన్ను విడిపించటం నా కర్తవ్యం కనుక విడిపించాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమంటాడు. అప్పుడు సీతాదేవే భర్త మనస్సును గ్రహించి స్వయంగా తానే అగ్ని ప్రవేశం చేసి ‘అగ్ని పునీత సీత అని ఖ్యాతిని తెచ్చుకున్నది. అయితే ఆమె అగ్ని ప్రవేశానికి కారణమయ్యేలా శ్రీరాముడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, రావణ వధ జరిగింది, 14 ఏళ్ళ వనవాసం పూర్తయింది. ఇంక తాను అయోధ్యకు వెళ్ళి రాజుగా పట్టాభిషిక్తుడవాలి. ప్రజారంజకంగా రాజ్యపాలన చెయ్యాలి. రాజు అవాలంటే, సచ్చరిత్ర ఉండాలి. నడవడిలో, తన శీలములో, చరిత్రలో ఎక్కడా ఒక్క మచ్చైనా ఉండరాదు. సీతాదేవి పరమ పతివ్రత అని తనకు తెలిసును. తన హృదయమే, తన ప్రాణమే సీత. అయినా లోకులు ఏడాది పాటు లంకలో కాముకుని చెరలో ఉన్న భార్యను రాముడు మోహంతో ఏలుకున్నాడని ఎవరైనా అనే అవకాశం ఉన్నది కనుక, ఆ అవకాశాన్ని వారికి ఇవ్వకుండా ఉండటానికే కంటిజబ్బు ఉన్నవారికి వస్తువు యొక్క యదార్ధ స్థితి కనపడనట్లుగా, మేఘం కప్పేస్తే, సూర్యకాంతి కనపడనట్లుగా నీ శీలం తెలియబడటం లేదంటాడు. అంటే అక్కడ సీతమ్మలో ఏ లోపం లేదు. చూసే కళ్ళలో ఉంది. చత్వారం ఉన్న కళ్ళకు వెలుగు కనపడనట్లుగా సీతమ్మ సతీత్వం, పాతివ్రత్యం కనపడటల్లేదని చెప్తున్నాడు, తనకు కాదు, లోకులకు ! అలా ఎందుకన్నాడు అంటే ఇప్పటి దాకా భార్యకు భర్తగానే ఉన్నాడు. కానీ రేపు పట్టాభిషేకం అయ్యాక సితారాముడు కాస్తా రాజారాముడవుతాడు. అప్పుడు మొదటి కర్తవ్యం ప్రజారంజనే ! ఒకసారి రాజయ్యాక ప్రజలే తన సర్వస్వం అవుతారు. వారి మాటలు, భావాలే గౌరవార్హాలవుతాయి తప్ప వ్యక్తిగత జీవితానికి ఆస్కారం ఉండదు. ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలకే ముందు ప్రాధాన్యత నివ్వాలి కనుక ఆ ప్రజలకు సీతమ్మ మీద ఏ అపోహ ఉండకుండా ఉండటానికి తాను రాజుగా పట్టాభిషేకం పొందటానికంటే ముందే సితారాములిద్దరి సచ్ఛీలతను నిరూపించేలా ప్రవర్తించాడు. అంటే రాజు ప్రజలను ఎలా గౌరవించాలో ఆచరించి చూపించాడు. కనుకనే ఆయనది రామ రాజ్యం అని ఈనాటికీ అందరం చెప్పుకుంటున్నాము. రాజులకు అధికారులకు ఉండవలసిన లక్షణం చరిత్రలో పారదర్శకత !
సకల కల్యాణ గుణాభిరాముడైన శ్రీరాముని పాలనలో దేశం ఎందుకంత సుభిక్షంగా ఉన్నదో, ప్రజలెందుకు రామరాజ్యాన్ని కోరుకుంటారో, ప్రకృతి ఎందుకు రామరాజ్యంలో పులకరిస్తుందో, ఈనాటి మన నేతలు, పౌరులు చిత్తశుద్ధితో, శ్రీ రాముని మీద భక్తితో, శ్రీమద్రామాయణం మీద శ్రద్ధతో రామాయణం విని అర్ధం చేసుకుంటే తెలుస్తుంది. ఆ ధర్మాలను ఆచరించితే రామ రాజ్యం వస్తుంది.
శ్రీ రామచంద్రుని పరిపాలనలో విద్యా, వైద్య, ఉద్యోగ, పారిశుధ్యత మొదలైన వివిధ రంగాలలో ఎటువంటి అక్రమాలు లేకుండా అందరూ ధర్మపాలనతో, సత్యనిష్ఠతో ఉండేవారు. ‘శృతౌ తస్కరతా స్థితా’ అంటారు. దొంగతనం అనే మాట వినటమే తప్ప అదెలా ఉంటుందో ఆ ప్రజలకు తెలీదు. రోగులే లేరు కనుక వైద్యుల అవసరమే లేదు. తప్పులనేవే జరిగేవి కావు కనుక న్యాయవాదులు, న్యాయమూర్తులకు పనే లేదు. లంచగొండితనము, నేటి కాలంలో సమాజంలో కనిపిస్తున్న ఎన్నో అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు అమానుష కిరాతక చర్యలు మచ్చుకైనా అసలు ఉండేవే కాదు. వారికి ఆ పదాలే తెలీవు. ప్రతి రంగంలోను ఏ లోపం లేని పరిపాలనను అందించాడు శ్రీ రామచంద్ర ప్రభువు.
మానవ సంబంధాలు ఎంతో ధర్మబద్ధంగాను పటిష్ఠంగాను ఉండేవి. ప్రజలందరూ శ్రీ రాముడేర్పరచిన ధర్మపథంలో నడిచేవారు. మానవుల ప్రేమలో నిష్కల్మషత్వము స్వచ్ఛత ఉండేవి. అవి నేటి కాలంలో లోపించాయి. ఆ కాలంలో తల్లితండ్రుల, పిల్లల బంధాలు, తోడపుట్టిన వారితో, బంధువులతో బంధాలు, తోటి మానవులతో అనుబంధాలు అన్నీ నైతిక విలువలతో కూడి పవిత్రమైన మనస్సులతో, స్వచ్ఛమైన ఆలోచనలతో ఉండేవి. అందరూ సంప్రదాయ బద్ధమైన వస్తరధారణతో కట్టు బొట్టు, మడి మన్నన, ఆచారము, వ్యవహారములు అన్నీ సత్త్వగుణ సంపన్నుల ప్రవర్తనల వలె ఉండేవి. అప్పటి ఆడపిల్లలు ఆడపిల్లలలా, విద్యార్ధులు, గృహస్థులు మొదలైన నాలుగు ఆశ్రమల వారు ఎవరి ధర్మాలను వారు పాటిస్తూ, జీవించేవారు. రామనామ స్మరణతో తరించేవారు.
నేటి కాలంలో అది కొరవడుతోంది. సత్త్వగుణము పాలు కంటే రజోగుణ తమోగుణముల అంశలు ఎక్కువై, స్వార్ధము, ద్రోహచింతన , మితిమీరిన అహంకారము, ధర్మప్రవర్తన లోపము, సత్యసంధత లోపించటము వల్ల, అనైతికత వల్ల సంఘంలో ఏ ఒక్కరిలోను నిజమైన ఆత్మీయత, ప్రేమానుబంధాలు లేవు. చాలా మంది మనస్సులలో ఒక విధమైన భయము, అశాంతి, నిర్లిప్తత, ద్వేషము, మాత్సర్యము, మితిమీరిన స్వార్ధము, లోభము విజృంభిస్తున్నాయి. అందరికీ తెలుసును. కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటున్నాము. మనుష్యుల మనస్సులు, ఆలోచనా ధోరణులు కలుషితమయ్యాయి. ఇటువంటి స్థబ్దత, దుస్థితి పోవాలంటే అందరి హృదయాల్లో ముందు అలజడి తగ్గి ప్రశాంతత కలగాలి. అధికారులు అధికారహోదా అనుభవించటం కోసం, అహంకరించటం కోసం కాక తాము పాలించవలసిన ప్రజలకు సర్వ సదుపాయాలు కలిగిస్తూ, ఆశ్రిత పక్షపాతం లేకుండా, ఆశ్రయించిన వారిలో ధర్మముంటే, వారిని కాపాడుతూ, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరికీ ఎవరి వృత్తే వారికి దైవమవాలి. కుటుంబంలో, కార్యాలయములలో ఎదురయ్యే ఏ విధమైన సమస్యలకైనా శాశ్వత పరిష్కారాలను ఆలోచించి అమలుపరచాలి. శ్రద్ధ, ప్రతిభ, పట్టుదల కలవారికి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని, వేతనాన్ని అందించాలి. అర్హులైనవారి అర్హతను గుర్తించాలి. అనర్హులను అందమెక్కించరాదు.
శ్రీరాముని పాలనలో అందరూ ఆనందంగానే ఉండేవారు. ఎందుకంటే ‘యథా రాజా తథా ప్రజాః’ కనుక ! మూర్తీభవించిన ధర్మస్వరూపుడైన రాముని మీది ప్రేమతో, భయంతో ప్రజలందరూ ధర్మబద్ధంగానే జీవించేవారు. తమలో తమకు ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినా, చిన్న గొడవలు జరిగినా, అది శ్రీరామునికి ఎక్కడ బాధ కలిగిస్తుందోనని వారే వెంటనే సర్దుకుని అభిమానం, ప్రేమ ప్రకటించుకుని అన్యోన్యంగా ఉండేవారు.
రామరాజ్యంలో అందరూ సంపూర్ణమైన ఆయుర్దాయంతో జీవించేవారు. ఎప్పుడూ ఎక్కడా అకాల మరణాలు లేవు. పెద్దలు జీవించి ఉండగా పిల్లలు మరణించటాలు లేవు. ఎప్పుడూ ఎవ్వరికీ దుర్మరణాలు కలగ లేదు. స్త్రీలకు వైధవ్యం లేదు. వ్యాధుల వల్ల కానీ, శతృరాజుల వల్ల కానీ, కౄరమృగాల వల్ల కానీ ఎవ్వరికీ ఎప్పుడూ బాధలు కలగలేదు. ఎప్పుడూ ధర్మకార్యాలు, దైవకార్యాలు జరుగుతూ ఉండేవి. యజ్ఞ యాగాదులు చక్కగా నిర్వహింపబడుతూ ఉండేవి. సకాల వర్షాలు కురిసేవి. ఏ ఋతు ధర్మాలు ఆ ఋతువులలో ప్రవర్తిల్లుతూ ప్రజలకు హితవును కలిగించేవి. ఎప్పుడూ వరదల వల్ల, తుఫానుల వల్ల, వడదెబ్బల వల్ల ప్రాణి హింస, మరణములు సంభవించేది కావు. రాజు ధర్మాత్ముడై ఉంటే, ప్రజలు ధర్మాత్ములై ఉంటారు. రాజు, ప్రజలు అందరూ ధర్మాత్ములై ప్రవర్తిస్తూ ఎవరి కర్తవ్యాలను వారు ఆచరిస్తూ ప్రవర్తిస్తుంటే, ప్రకృతి ఆనందించి సర్వ మానవులకు, సర్వ ప్రాణికోటికీ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రకృతి ఆనుకూల్యత వల్ల అందరి మనస్సులు ప్రశాంతతను, సంతృప్తిని, ఆనందాన్ని పొందుతాయి.
“ఆసన్ ప్రజాః ధర్మరతాః
రామే శాసతి నానృతాః !
సర్వే లక్షణ సంపన్నాః
సర్వే ధర్మపరాయణాః!!”
శ్రీరాముని పాలనలో ప్రజలందరూ ధర్మపరాయణులై, సర్వ శుభ లక్షణ సంపన్నులై, సత్య పరిపాలకులై ధర్మవర్తనులై ఉండేవారు.
శ్రీ రామచంద్రుని పరిపాలన ఎలా ఉండేది కాదు. అన్నది మనము రామాయణంలో అడుగడుగున గమనించ వచ్చును.
రాముని స్వభావము, ప్రవర్తన ఎలా ఉంటాయో, ఆయన పరిపాలన అలాగే ఉంటుంది కదా ! రఘువంశములోని రాజులందరలో సర్వసాధారణంగా ఉండే పదహారు సద్గుణాలను కాళిదాస మహాకవి తన రఘువంశ మహాకావ్యంలో ఇలా కీర్తించాడు.
సోऽహమాజన్మ శుద్ధానా
మాఫలోదయ కర్మణామ్ !
ఆ సముద్ర క్షితీశానా
మానాక రథ వర్త్మనామ్ !!
రఘువంశములో జన్మించిన రాజులందరూ జన్మతః పరిశుద్ధులు, ప్రారంభించిన కార్యములను విజయవంతముగా పూర్తి చేయువారు, సముద్రము వరకు కల భూమికి అధిపతులు, స్వర్గమునకు వెళ్ళు రథ మార్గము కలవారు, అనగా మాటి మాటిమాటికీ స్వర్గాది లోకములకు వెళుతూ వస్తూ ఉండేవారు.
యథావిధి హుతాగ్నీనాం
యథా కామార్చితార్ధినామ్ !
యథాపరాధ దండానాం
యథా కాల ప్రబోధినామ్ !!
శాస్త్రోక్త ప్రకారముగా హోమములు చేయువారు, యాచకుల కోర్కెలననుసరించి దానము చేయువారు, తప్పులకు తగిన దండనను విధించువారు, ఏయే కాలములలో ఏయే పనులు చెయ్యాలో, ఆయా కార్యములలో జాగరూకులై ఉండువారు.
త్యాగాయ సంభృతార్ధానాం
సత్యాయ మిత భాషిణామ్ !
యశసే విజిగీషూణాం
ప్రజాయై గృహమేథినామ్ !!
సత్పాత్రులకు దానము చెయ్యటానికే ధనమును సంపాదించుచు, సత్యమునే మాట్లాడుట కొరకు మితముగా మాట్లాడుచు, కీర్తిని సంపాదించుట కొరకు శతృ రాజులను జయించవలెననెడి కోరిక కలిగి ఉండి, పితౄణ విముక్తికి సాధన భూతులగు సత్సంతానమును పొందుట కొరకే వివాహమును చేసుకొనెడివారు.
శైశవేऽభ్యస్త విద్యానాం
యౌవనే విషయేషిణామ్ !
వార్ధకే ముని వృత్తీనాం
యోగేనాంతే తను త్యజామ్ !!
బాల్యమునందు విద్యల నభ్యసించుచు, యౌవనమునందు గృహస్థాశ్రమ ధర్మములనాచరించుచు, వార్ధక్యమునందు వానప్రస్థాశ్రమ ధర్మమును పాటించుచు, అంత్యకాలము నందు యోగము చేత దేహత్యాగమును చేయువారు.
ఈ గుణములు రఘువంశములో పుట్టిన రాజులందరిలోను సమానంగా ఉన్నాయి.
సూర్యుడు తాను గ్రహించిన నీటిని వేయి రెట్లుగా వర్షరూపంలో ఎలా తిరిగి అందిస్తాడో, అదే విధంగా రఘురాజులు పన్నుల రూపంలో ప్రజల నుంచి గ్రహించిన ధనము స్వల్పమైనా ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారు చేసే కార్యాలోచనములను ఎవ్వరికీ తెలియనీయక రహస్యముగా నుంచి ఫలముల వల్ల మాత్రమే తెలియబడేవిగా అమలుచేస్తారు.
ఏ భయము లేనివారయి తమ శరీరమును ధర్మార్ధకామముల సాధన కొరకు రక్షించుకొనుచు, ఏ బాధ లేకుండా ధర్మము నాచరించుచు, ఏ కోరిక లేకుండా ధనము సంపాదిస్తూ, ఏ ఆసక్తి లేకనే సుఖముల ననుభవించెడివారు.
దిలీప మహారాజును గురించి చెప్తూ ఇలా చెప్పారు –
“ప్రజానాం వినయాధానా
ద్రక్షణాద్భరణాదపి !
స పితా పితరస్తాపసాం
కేవలం జన్మ హేతవః”!!
దిలీపమహారాజు ప్రజలను సన్మార్గ వర్తనులనుగా చెయ్యటము వలన, భయములు కలుగకుండా అన్ని విధములుగా రక్షించటం వలన, అన్నపానాదుల చేత పోషించటం వలన వారందరికీ తండ్రి అయ్యాడు. వారి తల్లితండ్రులు వారికి కేవలం జన్మనిచ్చుటకు హేతుభూతులై ఉన్నారు.
దుదోహ గాం స యజ్ఞాయ
సస్యాయ మఘవా దివమ్ !
సంపద్వినిమయేనోభౌ
దధతుర్భువన ద్వయమ్ !!
దిలీప మహారాజు రాజుల దగ్గర నుంచి కప్పము రూపములో భూమి యందలి ద్రవ్యమును తీసుకుని విస్తారముగా యజ్ఞములను చేయుట ద్వారా దేవతలకు తృప్తిని కలుగజేసి స్వర్గమును, దేవేంద్రుడు స్వర్గము నుండి భూమి మీద సకాల వర్షమును కురిపించి సస్య వృద్ధిని కలుగ జేసి, ఒకరి లోకమును మరియొకరు చొప్పున రెండు లోకములను సంరక్షించు చుండెడివారు.
సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిన వార్త తెలియగానే భరతుడు ఎంతో ఖేదపడి సకల గుణాభిరాముడైన తన జ్యేష్ట భ్రాత శ్రీరామభద్రుడే అయోధ్యా నగరానికి రాజు తప్ప తను కాదని, అన్నని ప్రార్ధించి, బ్రతిమాలి తీసుకుని రావాలని మహర్షులతో, మాతలతో, అయోధ్యా పురవాసులందరితో కలిసి సీతారామ లక్ష్మణులున్న భరద్వాజ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళి శ్రీరాముని కాళ్ళ మీద పడతాడు. అత్యంత దుఃఖితుడై ఉన్న అనుజుని భరతుని చూసి ప్రేమగా తన ఒడిలో కూర్చోపెట్టుకుని కుశల ప్రశ్నలు అడుగుతున్నట్లుగా భరతునికి రాజ్యాన్ని ఎలా పాలించాలో బోధించాడు శ్రీరామ చంద్రుడు. ఇది అయోధ్యాకాండలోని నూరవ సర్గలో ఉన్నది. రాజ్యాన్ని ఎలా పాలించాలో చెప్తున్నాడంటే, శ్రీరామభద్రుడు అలా పాలించాడని అర్ధం చేసుకోవచ్చును. మన దేశ నాయకులు ప్రజలందరూ ఈ సర్గను చదివి అర్ధం చేసుకుని ఆచరణలో పెడితే మనము రామరాజ్యంలో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతాము. రామాయణ మందంతటా సత్యనిష్ఠ, ధర్మపాలనను చూపించారు. ఈ సర్గలో రాజు ఎలా ప్రవర్తించాలో బోధిస్తున్నారు.
దీనికి కచ్చిత్ సర్గ అని పేరు. కచ్చిత్ అంటే కః చిత్ – అంటే, కదా ! అని అర్ధము. ఇప్పుడు భరతుడు రాజు కనుక, ‘నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యకూడదు’ అంటూ రామచంద్రుడు బోధించాడు.
సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిన వార్త తెలియగానే భరతుడు ఎంతో ఖేదపడి సకల గుణాభిరాముడైన తన జ్యేష్ట భ్రాత శ్రీరామభద్రుడే అయోధ్యా నగరానికి రాజు తప్ప తను కాదని, అన్నని ప్రార్ధించి, బ్రతిమాలి తీసుకుని రావాలని మహర్షులతో, మాతలతో, అయోధ్యా పురవాసులందరితో కలిసి సీతారామ లక్ష్మణులున్న భరద్వాజ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళి శ్రీరాముని కాళ్ళ మీద పడతాడు. అత్యంత దుఃఖితుడై ఉన్న అనుజుని భరతుని చూసి ప్రేమగా తన ఒడిలో కూర్చోపెట్టుకుని కుశల ప్రశ్నలు అడుగుతున్నట్లుగా భరతునికి రాజ్యాన్ని ఎలా పాలించాలో బోధించాడు శ్రీరామ చంద్రుడు. ఇది అయోధ్యాకాండలోని నూరవ సర్గలో ఉన్నది. రాజ్యాన్ని ఎలా పాలించాలో చెప్తున్నాడంటే, శ్రీరామభద్రుడు అలా పాలించాడని అర్ధం చేసుకోవచ్చును. మన దేశ నాయకులు ప్రజలందరూ ఈ సర్గను చదివి అర్ధం చేసుకుని ఆచరణలో పెడితే మనము రామరాజ్యంలో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతాము. రామాయణ మందంతటా సత్యనిష్ఠ, ధర్మపాలనను చూపించారు. ఈ సర్గలో రాజు ఎలా ప్రవర్తించాలో బోధిస్తున్నారు.
దీనికి కచ్చిత్ సర్గ అని పేరు. కచ్చిత్ అంటే కః చిత్ – అంటే, కదా ! అని అర్ధము. ఇప్పుడు భరతుడు రాజు కనుక, నువ్వు ఇలా చెయ్యి, ఇలా పాలించు అనకుండా ఇలా చేస్తున్నావు కదా ! అలా ఉంటున్నావు కదా ! అంటూ కచ్చిత్ అంటూ శ్రీరామచంద్రుడు తమ్ముడికి బోధించాడు. అలాగే చేస్తుంటే అలాగే చెయ్యి, లేకపోతే అలా ఆచరించు అని హితవు పలుకుతున్నాడు. భారతీయ రాజకీయ శాస్త్రం ఈ సర్గలో బోధింపబడింది.
“కచ్చిత్ శుశ్రూషసే తాత
పితుః సత్యపరాక్రమమ్” ?
అని అడుగుతాడు. సత్యపరాక్రముడైన మన పితృపాదులను సేవిస్తున్నావా ?
అన్నింటి కంటే పరధానము తల్లితండ్రుల సేవ అని చెప్తున్నారు.
“ఇక్ష్వాకూణాముపాధ్యాయో
యథావత్ తాత పూజ్యతే” ?
మన కులగురువైన వసిష్ఠులవారిని, గురువులను భక్తితో పూజిస్తున్నావు కదా ! మాతృమూర్తులను నువ్వు ప్రేమతో సేవిస్తున్నావు కదా !
సకల శాస్త్రవేత్తలైన, పండితులైన పురోహితులను గౌరవిస్తున్నావు కదా !
అగ్నులను పూజిస్తూ ఏ సమయంలో అగ్నిలోఏవి హుతము చెయ్యాలో తెలిసి ప్రవర్తిస్తున్నావు కదా !
కచ్చిద్దేవాన్ పితౄన్ భృత్యాన్
గురూన్ పితృసమానపి !
వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే !!
దేవతలను, పితరులను, సేవకులను, గురువులను, పితృసమానులైన వారిని, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులను ఎవరిని ఎలా గౌరవించి ఆదరించాలో అలా ప్రవర్తిస్తున్నావు కదా !
కచ్చిదాత్మ సమాః శూరాః
శ్రుతవంతో జితేంద్రియాః !!
మనకు ఆత్మతో సమానమైన శూరులు, శాస్త్రజ్ఞులు, జితేంద్రియులు, సద్వంశ సంజాతులు, ఇంగిత జ్ఞానము కలిగిన మంత్రులను అత్యంత ఆదరంతో చూస్తున్నావు కదా ! ఎందుకంటే అటువంటి మంత్రుల సలహాలే, ఆలోచనలే రాజుల విజయానికి మూలము. ఇతరులలో దోషాలను చూడకుండా ప్రవర్తిస్తున్నావు కదా !
కచ్చిన్నిద్రావశం నైషీః
కచ్చిత్కాలేsవబుధ్యసే !
కచ్చిచ్చాపర రాత్రిషు
చింతయస్యర్ధ నైపుణమ్ !!
అతి నిద్రకు వశపడటం లేదు కదా ! సరైన సమయంలో పడుకుని సరైన సమయంలో నిద్ర లేస్తున్నావు కదా ! అర్ధరాత్రిపూట రాజకీయాల గురించి ఆలోచించటం లేదు కదా ! ఎందుకంటే అతినిద్ర సోమరితనాన్ని కలిగిస్తుంది. నిద్రలేమి అనారోగ్యానికి కారణమవుతుంది. సరైన నిద్ర ఉంటే బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది.
కచ్చిన్మంత్రయసే నైకః
కచ్చిన్న బహుభిస్సహ !
కచ్చిత్తే మంత్రితో మంత్రో
రాష్ట్రం న పరిధావతి !!
నీవొక్కడివే స్వంత నిర్ణయాలు తీసుకోవటం లేదు కదా ! చాలా మందితో కలిసి మంత్రాంగం చెయ్యటం లేదు కదా ! నీవు మంత్రులతో చేసే రహస్య ఆలోచనలు గోప్యంగా ఉంచబడాలి. శతృవుల వేగులకు చేరరాదు.
కశ్చిదర్ధం వినిశ్చిత్య
లఘుమూలం మహోదయమ్ !
క్షిప్రమారభసే కర్మ
న దీర్ఘయసి రాఘవ !!
తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నావు కదా ! మంచి నిర్ణయాలు చేసీనప్పుడు ఆలసించకుండా వెంటనే అమలు పరుస్తున్నావు కదా ! ఆ ప్రణాళికలను అమలు పరిచేవారు నీతిపరులయి ఉండాలి. తలపెట్టిన పనులు పూర్తయ్యాయో లేదో గమనించాలి. కొన్ని నిర్ణయాలు రహస్యంగా ఉంచబడాలి.
కచ్చిత్ సహస్రైః మూర్ఖాణాం
ఏకమిచ్ఛసి పండితమ్ !
పండితోహ్యర్ధ కృచ్ఛ్రేషు
కుర్యాన్నిశ్శ్రేయసం మహత్ !!
అనేక మంది మూర్ఖులతో కలిసి ఆలోచింటం కంటే ప్రజా క్షేమాన్నె ఆలోచించగలిగిన ఒక్క పండితునితో కలిసి చర్చించి చెయ్యటం శ్రేయస్కరమని, వారు నిశ్శ్రేయస్సును కలిగిస్తారని తెలుసును కదా, అని చెప్తూ ఒక మంచి మాటను చెప్పాడు శ్రీరామచంద్రుడు.
ఏకో2ప్యమాత్యో మేధావీ
శూరో దక్షో విచక్షణః !
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్ !!
మేధావి, సమర్ధుడు, శూరుడు, విచక్షణ జ్ఞానం కలవాడు అయిన ఒక్క మంత్రి అయినా రాజుకు రాజ కుమారులకు మహత్తరమైన శ్రేయస్సును కూర్చగలుగుతాడు.
ఏ పనికి ఎవరు సమర్ధులో వారినే ఎంపిక చేసి సేవకులను నియోగిస్తున్నావు కదా ! పితృపితామహుల నుంచి పారంపర్యంగా వస్తున్న శ్రేష్ఠులైన వారిని శ్రేష్ఠములైన ఆయాకర్మలకు నియోగిస్తున్నావు కదా !
కచ్చిన్నోగ్రేణ దండేన
భృశముద్వేజితాః ప్రజాః !.
రాష్ట్రే తవావజానంతి
మంత్రిణః కైకయీ సుత !!
వనవాస కాలంలో 14 ఏళ్ళు ఆహార నిద్రలను దరి చేరనీయకుండా వెన్నంటి ఉండి అన్న వదినెలను సేవించి తరించిన ధన్యాత్ముడైన మహనీయుడు లక్ష్మణ స్వామి.
తన అన్నగార్లను స్మరిస్తూ, సేవిస్తూ, శ్రీరామచంద్ర పరబ్రహ్మ దైవము యొక్క భక్తుడైన భరతుని భక్తుడై అవతరించిన ఆదర్శ భ్రాత శతృఘ్నుడు. అన్నదమ్ములంటే ఇలా ఉండాలని సర్వ కాలాలలోని సర్వ మానవాళికీ ఆదర్శ మూర్తులై భాసించారు.
సత్యము, ధర్మము, దయ, త్యాగము, సహనము, వినయ సంపద, సౌశీల్యము వంటి సమస్త దైవీ గుణ విలసితురాలైన పరమ పావన మూర్తి పతివ్రతా శిరోమణి సీతమ్మ ‘యో మే భర్తా స మే గురుః’ తన భర్తే తన గురువని చెప్పింది.
“దీనో వా రాజ్య హీనో వా యోమే భర్తా స మే ప్రియః” తన భర్త ఎలా ఉన్నా తన భర్తే తనకు ప్రియమని చెప్పింది సీతమ్మ తల్లి.
“మితం దదాతి పితా
మితం భ్రాతా మితం సుతః
అమితస్య హి దాతారం
భర్తారం కా న పూజయేత్” !! అన్నారు. తండ్రి కానీ సోదరులు కానీ కొడుకులు కానీ స్త్రీకి మితమైన శుభమునే కూర్చగలరు. అపరిమితమైన ఆనందాన్ని, శ్రేయస్సును కూర్చే భర్తను ఏ స్త్రీ పూజించదు ?
సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి అయిన తన భార్యను సీతాదేవిని రావణాసురుడు అపహరించగా బ్రహ్మాస్త్రంతో రావణాసురుని సంహరించాడు ప్రతాపశాలి అయిన శ్రీరామచంద్రుడు.
ఆంజనేయ స్వామి అవతరించిందే శ్రీరామ కార్యం కోసం ! శ్రీరామచంద్ర ప్లభువే తన దైవము, తన స్వామి తన సర్వస్వమని భావించి బంటు వలె సేవించిన, సేవిస్తున్న, ఆరాధిస్తున్న రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి.
శ్రీరామచంద్రుడు విళంబినామ సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో అభిజిల్లగ్నంలో జన్మించాడు. శ్రీరామచంద్రునికి సితామాతకు పరిణయము శ్రీరామనవమినాడే చేస్తాము. అలా ఎందుకు చేస్తామంటే, అవతార పురుషులు ఏరోజున అవతరిస్తారో, ఆరోజే వారి కల్యాణం చెయ్యాలని శాస్త్ర వచనం కనుక. అది అనాదిగా వస్తున్న ఆచారము కనుక కూడా ! ఆచారమే సంప్రదాయంగా మారుతుంది. ఏ దేవీ దేవతలనైనా విడివిడిగా ఆరాధిస్తాము కానీ సీతారాములను మటుకు ఎప్పుడూ కలిపే ఆరాధిస్తాము. సీతమ్మతో కూడిన శ్రీరామునే ఆరాధిస్తాము. విడి విడిగా పూజించము. సీతాలక్ష్మణాంజనేయ సహితమైన శ్రీరాముని ఆరాధిస్తాము. లేదా సంపూర్ణ పరివార శోభితుడైన పట్టాభిరాముని ఆరాధిస్తాము.
ఆంజనేయ స్వామి సీతారాములిద్దరినీ కలిపి ఆరాధిస్తాడు కనుకే మనకు ఆరాధ్యుడయ్యాడు. శ్రీకృష్ణుడు జన్మించిన కృష్ణాష్టమిన శ్రీకృష్ణుని ఆరాధించినట్లుగా శ్రీరామచంద్రుని పుట్టిన రోజున శ్రీరామచంద్రుని ఆరాధించాలని పూజా మంటపంపైన రాములవారి విగ్రహం పెట్టగానే, వెంటనే సీతమ్మ విగ్రహం పెడతాము. ఎందుకంటే శ్రీరాముని సీతమ్మను కలిపి పూజించాలి కనుక ! అయితే, సీతమ్మను శ్రీరాముని పక్కన పెడతాము కనుక వారికి కల్యాణము జరిపిస్తాము. అలా పుట్టిన రోజున కల్యాణం చెయ్యటం పరిపాటి అయింది. సీతారాములిద్దరూ ఒకరినొకరు విడిచి ఒక్క క్షణమైనా ఉండని జంట కనుకే వీరు మనకు ఆదర్శ దంపతులయ్యారు.
శ్రీ సీతారామ కల్యాణము లోక కల్యాణ కారకము. సీతారాముల వివాహం జరిపించి, తరువాత శ్రీరాముని జన్మదిన వేడుకలను జరిపించి, దేవతా మూర్తులుగా వారిని అర్చిస్తాము.
ఇది అనంత కాలం నుంచి అనూచానంగా పెద్దలు పెట్టిన సంప్రదాయము.
జై శ్రీరామ్. జై శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఘ్న ఆంజనేయ సుగ్రీవ విభీషణేత్యది పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః.
రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
మనకు శ్రీ సీతారాములే ఎందుకు ఆదర్శము?
లోకంలో ఎందరో అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్న దంపతులున్నా,
సీతా రాములనే ఆదర్శమైన జంటగా ఎందుకు చెప్పారు ? వీరి జంటే మానవులందరికీ ఎందుకు ఆదర్శ ప్రాయ మైంది ? అన్న విషయాన్ని తెలుసుకోవలసిన అవసరమున్నది.
మన మహర్షులు ఏర్పరచిన మానవ జీవన వ్యవస్థ సర్వ మానవాళికీ ఆదర్శము. ప్రతి వ్యక్తి తన ఆత్మోన్నతికీ, పరమాత్మ ప్రాప్తికీ ప్రయత్నిస్తూనే సంఘ శ్రేయస్సుకు పాటుపడేలా, ప్రతి వ్యక్తి మనస్సుకు శాంతి సంతృప్తులు కలిగేలా పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థను, వివాహ బంధాన్ని ఏర్పరచి, నిత్య నైమిత్తిక కర్మలతో కూడిన జీవన విధానాన్ని ఏర్పరచి విశ్వశాంతికి మార్గం చూపించారు మన మహర్షులు. “సర్వే జనాః సుఖినో భవంతు” అన్నది హైందవులందరి ఆశయము. ఆ ఆశయ సిద్ధికి ప్రధానము గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థాశ్రమ సార్ధకత అన్యోన్యమైన ప్రేమ కల దంపతుల వల్లనే సాధ్యపడుతుంది. అంటే దాంపత్యం వల్లనే సిద్ధిస్తుంది. అటువంటి దంపతులలో మన సర్వ మానవ జాతికీ ఆదర్శము శ్రీ సీతారాములే ! అందుకే కొత్తగా పెళ్ళి చేసుకున్న జంటను కానీ, పెళ్ళి రోజును జరుపుకుంటూ నమస్కరించిన జంటను కానీ సీతారాములలా అన్యోన్యంగా కలకాలం వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు పెద్దలు.
విశ్వములో మొదటి జంట పార్వతీపరమేశ్వరులు. వారి సంతానమైన మనమందరమూ ఉద్భవించినది వారిలోనుంచే ! మనందరికీ ఆదర్శము వారే ! శివ పార్వతులు అర్ధనారీశ్వరులయి, లోకంలో భార్యాభర్తలు అలా ఉండాలని తెలియజేశారు. విశ్వము యొక్క సృష్టి, స్థితి లయ కారకులైన, విశ్వ నిర్వాహకులైన దేవతలు సృష్టికి ప్రథమ దంపతులు. అందుకే పూజ ప్రారంభంలో – ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః,
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః అని దేవతా దంపతులకు నమస్కరించి, తరువాత అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః అని ఋషి దంపతులకు నమస్కరించి, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః అని మానవుల జంటలో సీతారాములకు నమస్కరిస్తాము. ఇది దంపతులలో శ్రేష్ఠులకు నమస్కరించ వలసిన పద్ధతి. ముందు అవినాభావంగా ఒకరి దేహంలో ఒకరు ఇమిడి పోయిన త్రిమూర్తులు, త్రిశక్తులు ఆది దంపతులుగా ఆదర్శమూర్తులు. వారిలో కూడా అదే వరస ఎందుకంటే, ఈశ్వరుడు తన దేహంలో అర్ధ భాగం అమ్మవారికి ఇచ్చేశాడు కనుక ప్రథమ స్థానం పార్వతీపరమేశ్వరులకు, లక్ష్మీదేవిని హృదయంలో దాచుకున్నాడు కనుక రెండవ స్థానం లక్ష్మీనారాయణులకు, తన నోటిలో – వాక్కులో తన భార్యను సరస్వతీ మాతను పెట్టుకున్నాడు కనుక మూడవ స్థానం బ్రహ్మసరస్వతులది.
వారి తరువాత దేవతలందరి పక్షాన దేవతల రాజైన దేవేంద్రుని, ఆయన భార్య అయిన శచీదేవిని ఆదర్శ దంపతులుగా కొలవాలి. ఇక్కడి వరకు దేవతల దంపతులు.
వీరి తరువాత మహర్షుల దంపతులకు ప్రతినిధులుగా సప్తర్షులలో అత్యంత ఆదర్శ దంపతులైన అరుంధతీ వసిష్ఠులకు సర్వ మానవ దంపతులూ నమస్కరించవలసినదే ! మహర్షి దంపతులలో వారే ఆదర్మము. ఎందుకంటే, అరుంధతీ వసిష్ఠులు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆకాశంలో సప్తర్షి మండలంలో సప్తర్షులు ఒక చోట కనిపిస్తారు. వారిలో వసిష్ఠ మహర్షితో పాటు ఆయన భార్య అరుంధతీ దేవి కూడా నక్షత్ర రూపంలో ఆయన పక్కనే ఉంటూ, తన భర్తని విడవకుండా, ఆయనతో కలిసి సంచరిస్తూ ఉంటుంది. కనుకనే వారు ఋషి దంపతులలో ఆదర్శ దంపతులు.
ఇంక మానవ దంపతులలో సావిత్రీ సత్యవంతులు, నలదమయంతుల వంటివారెందరున్నా, సీతారాములే ఆదర్శ దంపతులు. మానవులుగా పుట్టి, మానవ దంపతులుగా జీవితము గడిపిన వారిలో సీతారాములే ఎందుకు ఆదర్శ దంపతులంటే, పెద్దలు నిర్ణయించి పరిణయము చేసినప్పటి నుంచి వారిరువురు కూడా దేహములు రెండుగా కనిపిస్తున్నా ఇద్దరూ ఒక్కరే అన్నట్లుగా జీవితాంతమూ మెలిగారు. ఆనాటి రాజులలో, రఘువంశ రాజుల్లో కూడా బహుపత్నీత్వం ఉన్నా, శ్రీ రామ చంద్రుడు ఏకపత్నీత్వ వ్రతాన్ని అవలంబించాడు. సీత వల్ల తాను కళత్రవంతుడి నయ్యానని చెప్తాడు. భార్య అని చెప్పటానికి ఎన్నో పదాలు ఉన్నా, కళత్రము అనేది ఒక అద్భుతమైన పదము. కళత్రము అంటే, ఎవరు భార్య స్థానములో ఉండటం వల్ల ఆమె భర్త తను ఏ లోటూ, లోపమూ లేని సర్వ సుఖములను, శుభములను, శాంతినీ పొందుతున్నాననీ, ఇంక వేరే ఎవరి అవసరము లేని విధంగా ఆమె తనకు సౌఖ్యాన్ని కూర్చగలుగుతున్నదనీ భావిస్తాడో, ఆ భార్యను కళత్రము అంటారు. పరమ పతివ్రతా శిరోమణి అయిన సీతమ్మ కూడా శ్రీరాముని అలాగే ఆయనే తన సర్వస్వమని భావిస్తుంది. ‘ఛాయేవానుగతా తవ’ అని చెప్పారు శ్రీరామునితో జనకమహారాజు సీతమ్మను శ్రీరామచంద్రునికి ధారపోస్తున్నప్పుడు. సీతమ్మ శ్రీ రామునికి నీడలా వెన్నంటి ఉంటుంది. శ్రీ రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తాను కూడా వస్తాననీ, తాను ముందు నడుస్తూ రాముడు నడిచే బాటలో ఉన్న ముళ్ళు ఏరి శుభ్రపరుస్తాననీ, వనవాస సమయంలో తన తల్లితండ్రులను స్మరించననీ, తన భర్తతో కలిసి ఉంటే, అరణ్యమే మహా సౌధంలా ఉంటుందనీ చెప్తుంది. మనోవాక్కాయ కర్మలతో తన భర్తే దైవంగా ఉపాసించిన పరమ రామ భక్తురాలు సీతమ్మ. అరణ్యవాసానికి వెళ్ళే ముందు కౌసల్యాదేవి సీతమ్మతో ఈనాడు నీకు అరణ్యవాసం ప్రాప్తిస్తోందని నీ భర్తను చులకనగా చూడకమ్మా అని అన్నప్పుడు, వనవాస సమయంలో అరుంధతీ దేవి సీతమ్మకు పాతివ్రత్య ధర్మాలను చెప్తున్నప్పుడు సీతామాత తాను పుట్టింట్లోనే పాతివ్రత్య ధర్మాలను నేర్చుకున్నానని, తాను అలాగే ఉంటాననీ చెప్తుంది. సీతామాతను రావణాసురుడు అపహరించినప్పుడు భౌతికంగా భర్తకు దూరమైనా భర్త నామాన్ని జపిస్తూ, భర్త క్షేమం కోసం తపస్సు చేస్తూ కాలం గడిపింది. రావణ వధానంతరం భర్తను చేరవచ్చిన సీతామాతను కన్నెత్తైనా చూడకుండా, ఏడాదిపాటు రావణుని చెరలో ఉన్నావని ప్రజలకు సందేహం రావచ్చనగానే సీతమ్మ తానే లక్ష్మణునితో అగ్నిని ఏర్పాటు చెయ్యమని అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఆమెకు తన భర్తకు తన మీద ఉన్న నమ్మకము, ప్రేమ తెలుసు. కానీ రాజైన రాముడు ప్రజలకు సందేహం కలుగకుండా ఉండటానికే అలా చేశాడని తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. నిండు గర్భిణి అయిన సీతమ్మను గురించి ఒక కాముకుని చెరలో ఏడాది ఉన్నదని వదంతులు అయోధ్యావాసులలో వ్యాపించగా, శ్రీ రామచంద్రుడు రాజుగా ప్రజారంజనమే తన కర్తవ్యమని భావించి సీతమ్మను అరణ్యములో వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతములో వదిలి పెట్టించినా, సీతమ్మ శ్రీరాముని బాధ్యతలను అర్ధం చేసుకున్నదే కానీ తన భర్తను తప్పు పట్టలేదు. దేశాన్ని పరిపాలించే రాజుకు రాజుగా బాధ్యతే ప్రధానమనీ, ఆ తర్వాతే భర్తగాను, ఇతర బాధ్యతలునని గుర్తించి, భర్తృధ్యాన పరాయణురాలయి లవకుశులను ఋష్యాశ్రమ పవిత్ర వాతావరణంలో వాల్మీకి మహర్షి సంరక్షణలో, శిక్షణతో పెంచి, పెద్ద చేసి, పిల్లలను భర్తకు అప్పగించి, మళ్ళీ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటూ భూగర్భంలోకి వెళ్ళి పోయింది భూజాత జానకీదేవి. అశ్వమేథయాగాన్ని చేయ తలపెట్టిన శ్రీ రామచంద్రుడు భార్య పక్కన లేకుండా యాగం చెయ్యరాదు కనుక బంగారు సీత ప్రతిమను తన పక్కన కూర్చోపెట్టుకుని, తన భార్య మీద తనకున్న అచంచలమైన పవిత్ర ప్రేమను నిరూపించుకున్నాడు. జీవితంలో ఎన్ని ఒడుదైడుకులు సంభవించినా, సీతారాములిద్దరూ ఒకరితో ఒకరుగా, ఒకరికి ఒకరుగా నిలిచారు. ఇద్దరూ కలిసి మానవ ధర్మాలను, బంధాల పటిష్టతను ఆచరించి చూపించి, ఆదర్శంగా నిలిచారు. కనుకనే మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శవంతమైన జంట అయ్యారు. పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు. పరిపూర్ణమైన స్త్రీ సీతాదేవి. పరిపూర్ణమైన దంపతులు శ్రీ సీతారాములే ! వారే సర్వ మానవ దంపతులూ ఎప్పటికీ ఆదర్శము.
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
విశ్రాంత సంస్కృత ఆచార్యురాలు
శ్రీ రాముడు దేవుడు.
ఉపనిషత్తులలో కీర్తించబడే నిర్గుణ పరబ్రహ్మమే సగుణ సాకార రూపంలో
శ్రీరామచంద్రుడుగా, మానవుడిగా, దశరథ మహారాజుకు కుమారునిగా జన్మించాడు. రావణాసురుని సంహరించాలంటే పరమాత్మ మనిషిగానే పుట్టాలి. నరునిగా జన్మించి, వానరముల సహాయంతో మాత్రమే దుష్ట రావణ రాక్షస సంహారం చెయ్యగలుగుతాడు. కనుక పరిపూర్ణ మానవునిలా పుట్టి, మానవులలో ఉత్తమోత్తమ గుణ సమన్వితుడై, మానవునిలాగా సకల భావాలను అనుభవిస్తూ, బంధాలను, అనుబంధాలను, అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉత్తమంగా పాటిస్తూ, మంచి కుమారునిలా, సోదరునిలా, భర్తగా, స్నేహితునిలా, రాజుగా అనేక విధాలుగా మానవునిలాగానే ప్రవర్తించాడు. కానీ ఆయన యొక్క పరమాత్మ లక్షణాలు అంతర్నిహితంగా రామాయణంలో తెలుస్తాయి.
భరద్వాజ మహర్షి రచించిన భరద్వాజ రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎవరెవరికి ఎలా కనిపిస్తున్నాడో, ఎవరు ఎలా అనుకుంటారో ఈ శ్లోకంలో చెప్పారు.
రామః పిత్రోః పుత్రభావం
రావణాయ మనుష్యతాం !
ఋషీణాం భగవద్భావం
దర్శయన్ విచచారః !!
శ్రీరాముడు దశరథునికి పుత్రునిలా, రావణాసురునికి మనిషిలా, మహర్షులకు భగవంతునిలా కనిపించాడు. విశ్వామిత్ర మహర్షి దశరథుని రాజసభకు వచ్చి, తను చేస్తున్న యాగ రక్షణకు రాముడిని పంపమని అడిగినప్పుడు దశరథ మహారాజు పసిబుగ్గలతో పాలుతాగే వయస్సులో ఉన్న నా రాముడు రాక్షసులతో యుద్ధం చెయ్యటమా !! రాముడిని పంపలేను, నా సైన్యంతో నేను వస్తాను, యాగరక్షణ చేస్తానంటాడు. కానీ విశ్వామిత్రుడు అంగీకరించడు. రాముడినే పంపమంటాడు. పైగా నీ కుమారుని గురించి నీకు తెలీదు. మమకారంతో మోహపడుతున్నావు. రాముడెవరో నాకు తెలుసు, వసిష్ఠ మహర్షికి తెలుసు, తపస్సులో ఉన్న మహర్షులకు తెలుసు – అన్నాడు. తనకు రాముడెవరో తెలుసునన్నాడే కానీ ఆయనే పరమాత్మ అని తెలుసునని చెప్పలేదు. అతీంద్రియ దర్శన శక్తి కల మహర్షులందరికీ శ్రీమన్నారాయణుడే శ్రీ రామునిలా వచ్చాడని తెలుసు. కానీ రావణ వధ అయేవరకు ఈ రహస్యం బైట పడరాదనీ, రాముడే తాను మానవుడిలా ప్రవర్తిస్తుంటే, ఆయన దేవుడని తాము చెప్పకూడదని నిర్ణయించుకున్నారు.
“దశవర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ రామో రాజ్యం ప్రశాసతి” అన్నారు. శ్రీరామచంద్రుడు రాజ్యం పరిపాలించిన పదకొండువేల సంవత్సరాలు తాను నరునిలాగానే ప్రవర్తించాడు. కేవలము రావణ వధ, దుష్ట రాక్షస సంహారము మాత్రమే శ్రీరామావతార ప్రయోజనము కాదు. ధర్మమంటే ఏమిటి ? ధర్మాన్ని ఎలా ఆచరించాలి ? సత్యమంటే ఏమిటి ? ఎలా సత్యనిష్ఠ కలిగి ఉండాలన్నవి బోధించటానికి, ఒక సుస్థిరమైన సత్యమైన సద్రాజ్యపాలనను అందించి, ఆదర్శ రాజ్య పాలనను అందించటానికి, సర్వ మానవ బంధాలను ఏ విధంగా పాటించాలో నేర్పించటానికి అవతరించి, అన్నింటినీ తాను ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. మానవుడు సత్యనిష్ఠతో, ధర్మ బుద్ధితో, సద్గురువుల ఆదేశంతో సత్యపథంలో పయనించి దేవుడుగా మారగలడని ప్రత్యక్షంగా ఆచరించి చూపించాడు, అన్ని విధాల ఆదర్శ వంతుడయ్యాడు శ్రీరామ చంద్రుడు. నరునిగానే ప్రవర్తిస్తూ, నరునిగానే ఆచరిస్తూ, సాధారణ మానవులకు సాధ్యం కాని ఎన్నింటినో సుసాధ్యం చేసి చూపించాడు. శ్రీకృష్ణునిలా మహిమలు చూపించలేదు. రాముడు మానవునిలా ప్రవర్తించాడు కానీ ఎందరికో, ఎన్ని సందర్భాలలోనో రాముడు సామాన్య మానవుడు కాడని అనిపించింది. సేతువు నిర్మాణం కోసం త్రిరాత్ర వ్రత దీక్ష వహించి ప్రార్ధించినా సముద్రుడు మార్గం ఇవ్వకపోతే, సముద్ర జలాలను మొత్తం ఇంకించేస్తానని ధనుస్సు తీసి బాణం సంధించగానే సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అదీ రాముని యొక్క నరత్వ దైవత్వ సమన్వయము. సిద్ధాశ్రమములలో మహర్షులందరూ లోక క్షేమం కోసం యాగాలు చేస్తూనే ఉంటారు. అయినా విశ్వామిత్ర మహర్షే శ్రీరాముని తనతో యాగ రక్షణకు పంపమని ప్రప్రథమంగా వచ్చి ఎందుకు అడిగాడు అంటే, గాయత్రీ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్ర మహర్షి తాను దర్శించిన గాయత్రీ మంత్రాధిష్ఠాన దైవమే రామునిలా జన్మించటమును ముందు గ్రహించినందు వలన, ఆ పరమాత్మను నరునిగా దర్శించాలనీ, నరునిగా బాలునిలా ఉన్న రామునికి అప్రమేయ శక్తిని కలిగించి, అవతార కార్యమును ప్రారంభింప చెయ్యాలనీ, జగన్మాతతో జత కూర్చాలనీ, మహర్షులు నిర్దేశించే మార్గములో రాముడు పయనించేలా ఒరవడి పెట్టాలని సంకల్పించి, వచ్చి రామ లక్ష్మణులను తన వెంట తీసుకెళ్ళి, బల అతిబల విద్యలను ఉపదేశించి, దివ్యాస్త్రాలను అనుగ్రహించి, సీతామాతతో పరిణయానికి మార్గం కలిగించాడు.
రావణ వధానంతరము పరమేశ్వరుడే శ్రీరామ చంద్రుని దగ్గరికి వచ్చి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, రావణ వధ కోసం నరునిలా అవతరించావు, ఆ కార్యం పూర్తైంది కనుక ఇంక వైకుంఠానికి వచ్చెయ్యమంటాడు. అప్పుడు రాముడు
“ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం” అని చెప్పాడు. నీవు నన్ను ఎవరనైనా అనుకో, నేను మటుకు నన్ను దశరథుని కుమారుడైన
రాముడిని, మనిషిని అనే అనుకుంటున్నాను అని చెప్పాడు.
విశ్వామిత్రుడు రాముడినే ఎందుకు పంపమంటాడంటే, ఆయన లోక క్షేమం కోసం యాగం చేస్తుంటే రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షే తన తపో బల లవ లేశంతోనే ఆ రాక్షసులను సంహరించగలడు. కానీ రాముడినే రమ్మనటంలోని అంతరార్ధం – నీవు లోక రక్షణ కోసమే అవతరించావు. కనుక లోక క్షేమం కోసం చేస్తున్న యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న రాక్షసులను నువ్వే శిక్షించాలని చెప్పటమే ! శ్రీరామునికి కర్తవ్యాన్ని నిర్దేశించటమే !
మహర్షులు తమ తపోబలంలో ఆరవ వంతును ఆ రాజ్యాన్నేలే రాజుకు ధారపోస్తారు. రాజు ప్రజలను ఎలా రక్షిస్తాడో మహర్షులను, ఆశ్రమపదాలను కూడా అలాగే రక్షించాలి. అది రాజుల బాధ్యత. కులగురువైన వసిష్ఠ మహర్షి దశరథునికి విశ్వామిత్రుని తపో శక్తిని గురించి చెప్పి, నీ కుమారునికి శుభములను కలిగించటానికీ, తన దగ్గర ఉన్న మహిమ కల అస్త్రాలను అనుగ్రహించటానికే రాముని పంపమని అడుగుతున్నాడు కనుక నిస్సందేహంగా పంపమని చెప్తాడు. గురువుగారి మాటను ఎప్పుడూ పాటించే దశరథ మహారాజు శ్రీరాముని పిలిచి విశ్వామిత్రుని వెంట వెళ్ళమని చెప్తాడు. తండ్రి ఆదేశంతో విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళటానికి శ్రీరాముడు లక్ష్మణస్వామితో కలిసి వేసిన అడుగే రామావతార ప్రయోజనములలో ఒకటైన రాక్షసవధను సిద్ధింప చెయ్యటానికి వేసిన తొలి అడుగు .
రామునితో యుద్ధానికి సిద్ధ పడుతున్న రావణాసురునితో మాల్యవంతుడు ‘ఆ రాముడు మనిషి కాదనీ, నారాయణుడని అందరూ అనుకుంటున్నార’ని చెప్పినా రావణాసురుడు నమ్మలేదు. మారీచుడు మొదలైనవారు ఆ రాముడు సాధారణ మానవుడు కాదని చెప్పినా, నరవానరుల శక్తి అల్పమేనని భావించారు, పరమాత్మ అయిన నరుని చేతిలో మరణించాడు రావణాసురుడు.
శ్రీరాముడు రాజుగా పట్టాభిషిక్తుడై రామరాజ్యాన్ని స్థాపించాడు. సృష్టి ఉన్నంత వరకూ సర్వ మానవులూ ఆదర్శంగా భావించే ఆదర్శ పురుషుడయ్యాడు. అందుకే శ్రీ రాముడు మనందరికీ ఆరాధ్య దైవమైనాడు.
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
విశ్రాంత సంస్కృత ఆచార్యురాలు. తెలంగాణ ప్రభుత్వము.