Categories
OM

Ugadi

చాంద్రమాన శోభకృత్ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
चाचन्द्रभान शोभकृत् नूतन संवत्सर युगादि शुभाशयाः।
Best wishes on our bhaarateeya newyear day. Ugaadi.

యుగాది – ఉగాది ప్రాశస్త్యం.

సృష్ట్యారంభ దినారంభం యుగారంభం – ఉగాది పండుగ – యుగాది పండగ.
ఆంధ్రుల, కన్నడ, మరాఠి జనులకు
మహోత్సాహదము మొదటి పండగ.
చైత్రశుధ్ధ పాడ్యమి దినమే
ప్రకృతిలో ప్రజలకు ప్రథమ దినం,
కాలగణన ప్రారంభ దినం.
కొత్త వత్సరం, కొత్త మాసం, కొత్త దినం
ఈరోజేనని భాస్కరాచార్యులు ప్రకటించారు.

జ్యోతిశ్శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పుట్టిన దేశం, పండినదేశం మన భారతదేశం !!
సూర్యుని ద్వాదశ రాశుల చలనము
చాంద్రమాన, బార్హస్పత్య, నక్షత్ర మాన, సౌర, సావన కాలమానములకు కారణము.

ఉ – అన – ఉడు – నక్షత్రం
గ – అన – గమనం
ఆది – అన – ప్రథమం
చంద్రుడు నక్షత్రాలలొ కదిలే
క్రమారంభమే ఉగాది అనబడు.

పన్నెండు పౌర్ణముల, అమావాస్యలతొ
కొలవబడు కాలమే చాంద్రమానం.
అది మనకు సంవత్సరం.
ఆంధ్రులకు ప్రామాణికం చాంద్రమానం.

బార్హస్పత్యం బృహస్పతి మానం.
గురువు ఒక రాశిచక్ర భ్రమణకాలం
మన ద్వాదశ చాంద్రమాన సంవత్సర కాల సదృశం.
అట్టి ఐదు వత్సరములను
ఒక యుగమనుట కద్దు.
పన్నెండు ఐదుల అరువది కనుక
మనకు కలవు సంవత్సరములు అరవై.
అవియే మళ్ళీ మళ్ళీ పరిభ్రమిస్తాయి.
ఆ యుగ ఆరంభం చైత్రశుధ్ధ పాడ్యమి నాడే !
అందుకే ఉగాదిని యుగాది అంటారు.

ఉగాది నాడే బ్రహ్మదేవుడు
సృష్టిని ప్రారంభించాడు.
ప్రకృతి అంతా ఆకులు రాల్చి
క్రొత్త చిగుళ్లను తొడిగేను.
నవ కిసలయ శోభతొ, పూలుపళ్ళతొ
ఎంతో కళకళలాడేను.
నవ జీవనాన్ని అవి పొందేను.
మన అభివృద్ధిని సూచించేను.
పరవశముతొ కోకిల గానం చేసేను.
సువాసన సంభరితమౌ
మల్లెలు, మొల్లలు విరగబూసి
సౌరభమంతా నిండేను.
వసంత కాలమె మధుమాసం.
ప్రకృతిలో మైమరపించే అందం,
ఆనందం నిండును వసంతమందే.

ఉగాదినాడు మనకందరకూ
దశవిధ కృత్యాచరణమె శ్రేష్ఠం
ప్రతిగృహధ్వజారోహణమే ప్రథమము.
తదుపరి తైలాభ్యంగన, ఛత్రచామర,
పాదుకా స్వీకరణ, దమనేన బ్రహ్మపూజన,
సర్వాపత్శాంతికర మహాశాంత్యాచరణ,
నింబ పుష్ప భక్షణము,
పంచాంగశ్రవణము,
ప్రపాదాన ప్రారంభము,
రాజ, స్నేహ దర్శనము, దశమము
వాసంత నవరాత్రారంభ పూజనము.

ఆవుపేడతో కళ్ళాపి జల్లి,
చక్కని రంగవల్లులు తీర్చి,
గుమ్మాలకు చూతపత్ర తోరణమమర్చి,
సకల దేవతలనారాధించి, నింబపుష్ప భక్షణ చేయవలె.
వేపపువ్వు పచ్చడి తినవలె.
నింబ వృక్షమన ఉత్తమ వృక్షము
బహువిధ వైద్యగుణ భరితము నింబము.
నింబ కుసుమ కిసలయ భక్షణ
రక్షించును మన దేహమును
బహువిధ రోగాదులనుండి.
వేపచెట్టు గాలి పూర్తి ఆక్సిజనేసుమా!

తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు
రుచుల కలయికే, ఉగాది పచ్చడి ప్రత్యేకం.
శరీరానికారోగ్యప్రదం.
రసనేంద్రియ నిగ్రహమే అవసరం. అన్ని రుచులు ఆస్వాదనీయములె.
షడ్రుచుల సమ్మేళన వలెనే,
కష్టసుఖాలను, మంచిచెడులను,
అన్నిటినీ సమపాళ్ళలోనె గ్రహియించవలె, సమానముగ భావించవలె.

త్రిగుణాలను నిగ్రహించుచు, సత్వమునే పెంపొందించవలె.
వసంత కాలపు ఆనందం
మన జీవితమంతా నిండవలె.

భూతదయే మన కర్తవ్యమని
ప్రపాదానమును చేయవలె.
చలివేంద్రములేర్పరచవలె.
ఎండ తీవ్రతను తట్టుకొనుటకై
ఛత్ర, పాదుకల దానమీవలె.
వసంత నవరాత్ర పూజనమున
శ్రీరామచంద్రునారాధించవలె.

అన్నిటికంటె మిన్నగ తప్పక
పంచాంగపూజనము, పంచాంగ శ్రవణము చేయగావలె.
పంచాంగశ్రవణము కలిగించును
మనకెంతో హితమును.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములె –
పంచాంగములని పిలువబడు.
తిథిపూజ వలన సంపద,
దీర్ఘాయువు వారమునను,
నక్షత్ర పూజతొ పాపవిముక్తి,
యోగమున నారోగ్యము,
కార్యజయము కరణమున,
సమకూరునని శాస్త్ర వచనము.

భక్తి ఙ్ఞాన వైరాగ్య కుసుమ శుభ సౌరభమున,
మనసు గుబాళించవలె.
ప్రతి వత్సరమీ ఉగాది నాడు
పెద్దల ఆశీర్వచనములన్,
హితైషుల అభినందనలన్
తప్పక మనమూ పొందవలె.
శుభకార్యముల చేపట్టవలె.
సౌఖ్యముగా జీవించవలె.

జై హింద్.

రచన:
డా.విశాలాక్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *